గరుడ వాహన సేవకు భారీ ఏర్పాట్లు - గ్యాలరీల్లో రెండు లక్షల మందికి అవకాశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2024, 1:13 PM IST
Huge Arrangements For Garuda Vahana Seva in Tirumala : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడవాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించేలా సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
వకుళామాత, వెంగమాంబ కేంద్రాల నుంచి అన్నప్రసాదాల పంపిణీ నిరంతం జరిగేలా చర్యలు చేపట్టామని వెంకయ్యచౌదరి తెలిపారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో పాటు తిరుమలకు చేరుకొంటున్న భక్తులు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. స్వామి వారి గరుడవాహన సేవను వీక్షించేందుకు సుమారు మూడు లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తుల తొక్కిసలాటకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలియజేశారు.