వైఎస్సార్సీపీ హయాంలో చాలా మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి: హోంమంత్రి అనిత - Home Minister Anitha in Antarvedi - HOME MINISTER ANITHA IN ANTARVEDI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 2:21 PM IST
Home Minister Anitha Visit Lakshmi Narasimha Temple: వైఎస్సార్సీపీ హయాంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని ఇవి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి ఆమె చేరుకున్నారు. పూర్ణ కుంభంతో ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి అర్చకులు వేదాశీర్వచనం అందించారు. హోంమంత్రి హోదాలో తొలిసారి స్వామివారిని అనిత దర్శించుకున్నారు. అనంతరం తర్వాత ఆమె మాట్లాడారు. రాబోయే కాలంలో హోంమంత్రిగా రాష్ట్రంలో రక్షణ, మహిళల తాలుక భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
గత ఐదు సంవత్సరాలలో ఆడపిల్లలు తప్పిపోయి కేసులు చాలా ఉన్నాయన్నారు. మహిళలతోపాటు సామన్య ప్రజల భద్రత కూడా ఎంతో అవసరమన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వీటిని అరికట్టేందుకు పోలీసుశాఖతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. అన్ని అంశాలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని పేర్కొన్నారు.