ఉమ్మడి మహబూబ్‌నగర్‌ను ముంచెత్తిన వాన - ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు - Heavy Rain Mahabubnagar - HEAVY RAIN MAHABUBNAGAR
Published : Sep 1, 2024, 9:03 AM IST
Heavy Rain Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి తెడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలో కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ సమీపంలోని జగ్జీవన్‌రామ్ నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పెద్ద చెరువు వైపు వెళ్లే ప్రధాన కాల్వ చెత్తాచెదారంతో మూసుకుపోవడంతో అటువైపు వెళ్లాల్సిన నీళ్లు ఇళ్లలోకి మళ్లాయి. పెద్ద చెరువుకు దిగవన ఉన్న బీకే రెడ్డి కాలనీ, పీర్లబాయి సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.
గతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు మూడు కాల్వల ద్వారా పెద్ద చెరువులోకి చేరేది. పెద్ద చెరువును ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసిన తర్వాత మురుగు నీరు చెరువులోకి చేరకుండా కాల్వలు నిర్మించి మురుగు నీటిని పట్టణం బయటకు పంపుతున్నారు. రాత్రి రెండున్నర నుంచి ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఆర్టీసీ డిపోలోనూ వరద నీరు చేరింది. మున్సిపల్ కమిషనర్ ఆనంద్ గౌడ్, ఆర్డీవో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.