తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి - 25 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటి విడుదల - Heavy Floods to Taliperu Project - HEAVY FLOODS TO TALIPERU PROJECT
Published : Jul 21, 2024, 10:45 PM IST
Heavy Floods to Taliperu Project : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు జలాశయం స్థాయిని మించి ఉప్పొంగుతోంది. దీంతో ఆదివారం 25 గేట్లను వదిలి గోదావరి నదిలోనికి నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసిన అధికారులు ఈరోజు 80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులో క్రమేపీ వరద ఉద్ధృతి పెరుగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ ఉపేందర్ వివరించారు. మరో పక్క చింతవాగు, పగిడి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తాళిపేరుకు నీటిమట్టం పెరగడంతో స్థాయికి మించి పరవళ్లు తొక్కుతోంది. దీంతో వరద నీరు ఉద్ధృతంగా దిగువనకు ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.