బతికున్న చేపను మింగాడు - చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు - A MAN SWALLOWED A LIVE FISH
Published : Oct 7, 2024, 5:18 PM IST
A Fish in The Man Throat : సరదాగా వేసుకున్న పందెం ఓ వ్యక్తిని చావు అంచులదాకా తీసుకెళ్లింది. అది ఎంత తీవ్రమైందంటే ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లు చికిత్స అందించకుంటే ప్రాణాలు పోయేంత క్లిష్ట పరిస్థితిలోకి వెళ్లింది. వివరాలలోకి వెళితే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బోగోలుకు చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి ఒక పందెంలో భాగంగా బతికున్న చేపను మింగాడు. ఆ చేప దురదృష్టవశాత్తు గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి తీసుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కక్కలేక, మింగలేక అన్నట్లు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోయాడు.
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వెంకటస్వామి గొంతులో ఇరుక్కున్న చేపను డాక్టర్లు చాకచక్యంగా వ్యవహరించి బయటికి తీశారు. ఆ తర్వాత వెంకటస్వామితో పాటు కుటుంబసభ్యులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై డాక్టర్లు మాట్లాడుతూ ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితులలో కూడా చేయవద్దని హెచ్చరించారు. ఊపిరి ఆడకపోతే క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంటుందని తెలిపారు.