గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు 50 ఏళ్లు పూర్తి- ఘనంగా వేడుకలు - గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు 50ఏళ్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 10:26 AM IST
Godavari Express Golden Jubilee Celebrations: విశాఖ- హైదారాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యంత సౌకర్యంగా.. ఉండే ఈ సర్వీస్‌ను 1974 ఫిబ్రవరి 1 ప్రారంభించారు. తొలి సర్వీస్ వాల్తేర్- సికింద్రాబాద్ మధ్య నడిచింది. అలా మొదలైన ప్రయాణం 50 ఏళ్లలో ఎన్నో లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గోదావరి ఎక్స్‌ప్రెస్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో అధికారులు కేక్ కట్ చేశారు. అత్యంత సురక్షిత ప్రయాణానికి చిరునామాగా ఉన్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎంతో మంది భావోద్వేగాలతో ముడిపడి ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ 18 స్టేషన్లలో ఆగుతుంది. ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఘనత సాధించింది.
"ప్రయాణికుల ఒక సెంటిమెంట్‌గా గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను చెప్పుకోవచ్చు. తమ గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకొని వెళ్తుందనే ఒక నమ్మకం కూడా ఈ రైలు ప్రత్యేకత. సమయపాలన, శుభ్రత విషయంలో ఈ ట్రైన్ రాజీలేదు. దీనిని నడిపే డ్రైవర్ల సైతం గోదావరితో పనిచేయడం ఒక అనుభూతిగా భావిస్తుంటారు. ఒకప్పుడు విమాన రాకపోకలు అందుబాటులో లేని సమయంలో హైదరాబాద్ నుంచి విశాఖకు ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సినీ ప్రముఖులు సైతం ఈ రైలులోనే ప్రయాణించేవారు." - రైల్వే అధికారులు