సిద్దిపేట జిల్లాలో బాలికపై అత్యాచారం - నిందితుడి ఇంటికి నిప్పంటించిన గ్రామస్థులు - Girl Raped in Siddepet - GIRL RAPED IN SIDDEPET
Published : Sep 29, 2024, 6:41 PM IST
Rape on a Girl in Siddipet : సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిపై గ్రామస్థులు మండిపడ్డారు. అతన్ని నిలదీసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే సదరు యువకుడు పరారయ్యాడు. దీంతో అతడి ఇంటిపై బంధువులు, గ్రామస్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. కొమురవెల్లి మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్థులు నిందితుడి ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న కారు, జేసీబీ వాహనం, బైక్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు పోలీసులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన గ్రామస్థులను అదుపు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. నిందితుడిని పట్టుకుని పోక్సో కేసు నమోదు చేశామని, తప్పకుండా కఠినంగా శిక్షపడేలా చేస్తామని చెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.