మందుబాబుల వీరంగం - టోకెన్ తీసుకోవాలన్నందుకు హోటల్‌పై దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 4:52 PM IST
Four Persons Attacked At Tea Shop in Tirupati District : తిరుపతి జిల్లా గాదంకి టోల్ ప్లాజా సమీపంలోని టీ దుకాణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. టీ దుకాణ సిబ్బందిపై దాడికి పాల్పడడంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. అందులో ఒక యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. దుకాణ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో వచ్చి దుకాణం వద్ద టీ అడిగారు. అక్కడ ఉన్న సిబ్బంది టోకెన్ తీసుకోమని తెలిపారు. దీంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వెంటనే దుకాణ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కుర్చీలు, కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో ఉదయ్, చేతన్, దిలీప్ అనే ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. అందులో దిలీప్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మందుబాబుల దాడిలో దుకాణంలోని కుర్చీలు, బెంచీలు, గ్లాసులతో పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. మద్యం మత్తులో దాడికి పాల్పడిన ఉదంతం మొత్తం దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దుకాణదారుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.