అటకెక్కిన సెజ్- మా భూమి మాకే ఇవ్వాలంటూ రైతుల ధర్నా - సెజ్ భూములు తిరిగి ఇవ్వాలన్న రైతులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 5:40 PM IST
Formers protest In Satyasai District For SEZ Land : పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వాలంటూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం సి.కొడిగేపల్లి సమీపంలో పరిశ్రమల ఏర్పాటుకు సేకరించిన స్పెషల్ ఎకనామికల్ జోన్ (సెజ్) (special Economical Zone) భూముల్లో ఇప్పటివరకూ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని రైతులు తెలిపారు. ఖాళీగా ఉన్న తమ భూములు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా(Protest) చేపట్టారు.
రైతులు, రైతు సంఘం నాయకులు కార్యాలయం మెట్ల పై కూర్చొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమల కోసం 2004 లో సెజ్ భూములు మడకశిర, పరిగి మండలం లోని పలు ప్రాంతాల్లో రైతుల దగ్గర తీసుకున్నారు. వాటిలో ఇంతవరకూ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాలలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే రైతుల భూములు రైతులకు వెనక్కి ఇవ్వాలని తెలిపారు.