'వాల్యూస్, ఎథిక్స్' లేవని జగన్ నిరూపించుకున్నాడు: కేఎస్ జవహర్ - Intermediate Values and Ethics
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:32 PM IST
Former Minister KS Jawahar Fire on Chief Minister Jagan : విద్య లేని జగన్ మోహన్ రెడ్డికి విద్యా వ్యవస్థపై గౌరవం లేదని, ఆయనకు ఎలాంటి విలువలు కూడా లేవని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. తన సభ కోసం ఇంటర్మీడియట్ పరీక్ష వాల్యూస్, ఎథిక్స్ పేపర్‌ను వాయిదా చేయించిన జగన్.. తనకు అవి లేవని నిరూపించుకున్నాడని విమర్శించారు. జగన్ అధికార దాహానికి విద్యావ్యవస్థ సర్వ నాశనమైందని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు సభ కోసం కళాశాల బస్సులను హైజాక్ చేయడం దుర్మార్గం, రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలను చీకటి మయం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని జవహర్ ధ్వజమెత్తారు.
దెందులూరులో సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని విద్యాలయాలకు సెలవు ప్రకటించటం తగదని మండిపడ్డారు. ఏ జిల్లాలో సభలు పెడుతుంటే అక్కడ విద్యాలయాలకు సెలవులు ఇస్తున్నారని ఆక్షేపించారు. గతంలో వైసీపీ ప్లీనరీకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సెలవులు, మొన్న కాకినాడలో వైసీపీ సమావేశాన్ని జేఎన్టీయూ లో ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. జగన్ అధికార మదానికి విద్యా వ్యవస్థను బలి చేస్తున్నారని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు ఏడాది అంతా కష్టపడి చదివితే నేడు దానిని వాయిదా వేశారని మండిపడ్డారు.