ఉన్నత స్థాయికి ఎదిగినా మూలాలు మరచిపోకూడదు: జస్టిస్ ఎన్వీ రమణ - Former CJI Justice NV Ramana - FORMER CJI JUSTICE NV RAMANA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 9:35 PM IST
Justice NV Ramana Inaugurated Delhi Public School: విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదిగినా మూలాలను మరచిపోవద్దని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుంచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలదే అని పేర్కొన్నారు. నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌ను జస్టిస్ రమణ ప్రారంభించారు.
నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన దిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. పల్నాడు లాంటి గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దిల్లీ పబ్లిక్ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఈ పాఠశాల ద్వారా అత్యుత్తమ విద్య చేరువవుతుందని ఎన్వీ రమణ పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు అనేది విద్య మీదనే అధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ చేరబోతోందని, తెలుగు ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రంపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారత్ కానుందని పేర్కొన్నారు.