కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం - మంటలు ఆర్పుతుండగా పలువురికి గాయాలు - duggirala
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 12:36 AM IST
Fire Accident in Cold Storage: గుంటూరు జిల్లాలోని కోల్డ్ స్టోరేజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శీతల గిడ్డంగిలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఎగసిపడ్డాయి. గోదాం తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు ఫైర్‌సిబ్బంది యత్నించగా, తలుపు దగ్గర ఒక్కసారిగా మంటలు రావడంతో ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో డీఎఫ్‌వో శ్రీనివాస్‌రెడ్డి, ఏఎఫ్‌వో కృష్ణారెడ్డి సహా పలువురు ఉన్నారు. 5 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అయినప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.
ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు మంగళగిరి, తెనాలి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రం నుంచి శ్రమిస్తున్నారు. సిబ్బంది గిడ్డంగి అద్దాలు పగులగొట్టి నిచ్చెనల ద్వారా లోపలికి వెళ్లి మంటలు ఆర్పుతున్నారు. మంటల కారణంగా శీతల గిడ్డంగిలో పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. శీతల గిడ్డంగిలో లక్ష బస్తాల సరకు ఉందని యజమాని తెలిపారు.