రహదారి లేక మధ్యలోనే నిలిచిన అంబులెన్స్- కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ గ్రామానికి - Father Carried Son Dead Body 8 km - FATHER CARRIED SON DEAD BODY 8 KM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 8:41 AM IST
Father Carried his Son Dead Body for 8 kilometers in Alluri District: గిరిజన ఆదివాసి కొండ గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేక మార్గమధ్యలో అంబులెన్స్ నుంచి కుమారుడి మృతదేహాన్ని దించేయగా చీకట్లో తండ్రి 8 కిలోమీటర్లు మోసుకుంటూ నడిచిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. అనంతగిరి మండలం చినకోనంకి చెందిన కొత్తయ్య, సీత దంపతులు జీవనోపాధి కోసం గుంటూరు జిల్లా కొల్లూరుకు వలస వెళ్లారు. వారి రెండు సంవత్సరాల కుమారుడు అక్కడే అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకుని అంబులె్న్స్లో స్వగ్రామానికి బయలుదేరారు.
కానీ ఆదివాసీ కొండ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది విజయనగరం జిల్లా మెంటాడ వనిజ వద్ద వారిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో కొత్తయ్య కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ కాలినడకనే 8 కిలో మీటర్ల దూరం నడిచి చినకోనంకు చేరుకున్నారు. ప్రభుత్వాలు హామీ ఇచ్చినా కొండ గ్రామాలకు రహదారి లేక ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఇటీవల రహదారులు లేక అంబులెన్స్ రాకపోవడంతో నిండు గర్భిణిని చేతులతో మోసుకెళ్తుండగా మార్గం మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రహదారులను పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.