పరిహారమివ్వని ఎన్హెచ్ఏఐ - ఫర్నిచర్ స్వాధీనానికి కోర్టు అనుమతి - ఎన్హెచ్ఏఐ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 10:17 PM IST
Farmers tried to NHAI furniture Possession: ఎన్హెచ్ఏఐ పీడీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకునేందుకు విజయవాడ సివిల్ కోర్టు రైతులకు అనుమతినిచ్చింది. గన్నవరం మండలం బీబీ గూడెంకు చెందిన రైతులు చినఅవుటుపల్లి నుంచి చినకాకాని రహదారికి భూములిచ్చారు. మొదట ఎకరాకు 38 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు 22.5 లక్షలు మాత్రమే ఇచ్చారని రైతులు తెలిపారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలని రైతులు ఆర్బిట్రేషన్ కు వెళ్లారు. విచారణ జరిపిన ఆర్బిట్రేషన్ రైతులకు గతంలో ఇచ్చిన పరిహారం పై అదనంగా 30 శాతం చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఆర్బిట్రేషన్ తీర్పును ఎన్హెచ్ఏఐ అమలు చేయకపోవటంతో రైతులు విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై సివిల్ కోర్టు విచారణ జరిపింది. మొత్తం 25 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఎకరాకు సుమారు 8 నుంచి 9 లక్షల రూపాయల పరిహారం రావాలని తెలిపారు. మొత్తం 25 ఎకరాలకు 2 కోట్ల రూపాయల పైనే చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఏఐ పీడీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో రైతులు గురునానక్ కాలనీలోని కార్యాలయానికి చేరుకున్నారు. స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన కోర్టు సిబ్బందికి ఎన్హెచ్ఏఐ సిబ్బంది సహకరించ లేదని రైతులు చెబుతున్నారు. ఉదయం నుంచి కార్యాలయం వద్ద వేచి ఉన్నా, స్పందించటం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్హెచ్ఏఐ సహకారం లేకపోవటంతో రైతులు వెనుదిరిగారు. ఈ విషయాన్ని కోర్టుకు విన్నవించి పోలీసు ప్రొటెక్షన్ తీసుకుంటామన్నారు.