రైతుల సొమ్ము కాజేసిన వ్యవసాయ సహాయకుడు- దాదాపు ₹కోటికి పైగా స్వాహా - రైతు భరోసా కేంద్ర ఉద్యోగి మోసం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 12:36 PM IST
Farmers Complaint to Collector: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనేపూడిలో రైతు భరోసా కేంద్రంలో పనిచేసే వ్యవసాయ సహాయకుడు అనిల్ కుమార్ తమను మోసం చేశారని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని చెప్పి తమను మోసం చేశాడని రైతులు వాపోయారు. లక్షల రూపాయలు కాజేశాడని అన్నదాతలు కలెక్టర్ ముందు ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు, గొర్రెలు, డ్రోన్లు మంజూరు చేయిస్తానని ఒక్కొక్కరి వద్ద సూమారు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడని రైతులు ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగి అనే నమ్మకంతో 70 లక్షల రూపాయల వరకు చెల్లించామని మరికొంత మంది రైతులు పేర్కొన్నారు. అలాగే పిడుగురాళ్ల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సుమారు కోటిన్నర వరకూ వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి నిందితుడిపై చర్యలు తీసుకొని తమ నగదును ఇప్పించాలని రైతులు కోరారు.