చేతబడి చేస్తోందని భార్య పళ్లు ఊడగొట్టేందుకు యత్నించిన భర్త- బ్రహ్మపురంలో దారుణం - Family Members Attack On Women - FAMILY MEMBERS ATTACK ON WOMEN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 5:11 PM IST
Family Members Attack On Women In Krishna District : కృష్ణజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త చెప్పుడు మాటలు విని భార్యపై దాడికి పాల్పడ్డాడు. చేతబడి చేస్తుందనే అనుమానంతో వెంకట ముఖర్జీ అనే వ్యక్తి అతడి భార్య లాస్య హిమ బిందును కొట్టాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడటంతో ఆమె సోదరుడు హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. దీనిపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మచిలీపట్నం కలెక్టరేట్ సమీపంలోని బ్రహ్మపురంలో వీరు నివాసం ఉంటున్నారు. తన భార్య చేతబడి చేస్తుందనే అనుమానంతో ముఖర్జీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంత్రాలు చదువుతుందనే అనుమానంతో కటింగ్ ప్లేయర్తో తన పళ్లు లాగటానికి ప్రయత్నం చేశారని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది. తనకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా కూడా దాదాపు 12 గంటలు గృహనిర్బంధం చేసి దాడికి పాల్పడాని తెలిపింది. తన సోదరుడి ఫోన్ చేయడంతో జరిగిన దారుణాన్ని చెప్పానని, విజయవాడలో ఉన్న సోదరుడు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల తాను బయటపడ్డానని లాస్య తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.