నాకు అవకాశం ఉంటే మళ్లీ కలిపేవాడిని: కిరణ్ కుమార్ రెడ్డి - Division of Districts in AP - DIVISION OF DISTRICTS IN AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 7:27 AM IST
EX CM Kiran Kumar Reddy Comments : వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాల విభజన చేసి చాలా తప్పు చేశారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ తనకే అవకాశం ఉండి ఉంటే జిల్లాలను మళ్లీ కలిపేవాడినని అన్నారు. అనాలోచితంగా చేసిన నిర్ణయం వల్ల జిల్లాలకు ఉన్న ప్రాధాన్యత కోల్పోయినట్టు అయిందన్నారు. మరోవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలు అయితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు చొరవ తీసుకొని బలమైన వాదనలు వినిపించాలని అన్నారు. దీనిపై 11 ఏళ్ల క్రితం తాను స్టే తెస్తే ఇప్పటివరకు ఆ స్టే కొనసాగుతోందని, అసలు బ్రిజేష్ కుమార్ని ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి సమర్ధుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని ఆయన ఐదేళ్ల పాలనలో ఒక బలమైన ముద్రతో పాలన సాగించాలన్నారు.
గత ఐదేళ్లలో ఆర్థికంగా, శాంతి భద్రతలపరంగా రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని దీనిని సరి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. రాజధాని, పోలవరం వంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.