Inhumanity Incident in Sri Sathya Sai District : శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల పలువురు అనుచితంగా ప్రవర్తించారు. ఆమె జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో పలువురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని డీఎస్పీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ గ్రామంలో అమ్మాయి అదృశ్యమైందని తమకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. అనంతరం ప్రేమజంటను అదుపులోకి తీసుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని వెంకటేశ్వర్లు వివరించారు.
కానీ ఆ బాలిక మైనర్ కావడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం దీనంతటికి ఓ మహిళే కారణమని భావించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులు, వివాహిత జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈ ఘటనకు పాల్పడిన 13 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచామన్నారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు.
"యువతి అదృశ్యమైందని ఫిర్యాదు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రేమ పేరుతో ఓ యువకుడు తీసుకెళ్లినట్లు గుర్తించాం. ఇద్దరిని పట్టుకొని విచారించాం. బాలిక మైనర్ కావడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం. ఓ వివాహిత ఈ ప్రేమజంటకు సహకరించారని అమ్మాయి బంధువులకు అనుమానం. ఈ క్రమంలోనే ఆ మహిళపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారు." - వెంకటేశ్వర్లు, డీఎస్పీ
ప్రేమిస్తున్నాడని యువకుడిని చితకబాదిన యువతి బంధువులు - వీడియో వైరల్