మహిళల అత్మగౌరవాన్ని కాపాడిన నేత మోదీ : ఈటల రాజేందర్ - lok sabaha elections 2024 - LOK SABAHA ELECTIONS 2024
Published : May 4, 2024, 4:24 PM IST
Etela fires on Congress : బీజేపీ పాలనలో స్త్రీలకు అన్ని రంగాలలో పెద్దపీట వేశారని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గ్రామీణ పేద మహిళల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించి, భారతదేశ స్త్రీల ఆత్మగౌరవాన్ని కాపాడిన గొప్ప వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారని ఆయన తెలిపారు. కంటోన్మెంట్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనానికి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవాన్ని మరింత పెంపొందించారని ఆయన పేర్కొన్నారు. గతంలో 50 సంవత్సరాలు పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో మహిళలకు సరైన గౌరవాన్ని ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఈటల ఆరోపించారు. మహిళా శక్తిని, యువశక్తిని మరింత బలోపేతం చేసేందుకు మోదీ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాలను తెరిచి మహిళలకు రుణాలు ఇప్పించడంతో పాటు, సొంత ఇల్లు కూడా మహిళల పేరుపైనే ఇస్తున్న ఘనత మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు.