'లంచం కొట్టు ఆర్డర్ పట్టు'- మార్కాపురం ఈఈ వైఖరిపై ఉద్యోగుల మండిపాటు - Electricity workers strike
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 5:10 PM IST
Electricity workers strike in Prakasam District : ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వర రావు తీరును నిరసిస్తూ విద్యుత్ కార్యాలయం ఎదుట ఏపీ ఈఈ యూనియన్ విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కార్యాలయం ఎదుట ఉద్యోగులు (Employees) నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 'లంచం కొట్టు ఆర్డర్ పట్టు' అన్న విధంగా ఈఈ నాగేశ్వరరావు వ్యవహారం ఉందని ఉద్యోగులు ఆందోళన (Protest) చేపట్టారు.
బదిలీల్లో కూడా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. గిద్దలూరు రూరల్ పోస్ట్, అన్నంపల్లి ఎస్ఎస్ పోస్ట్ అమ్ముకున్న అతనిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా అన్ని తానై వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. వర్కర్ల యూనియన్ల మధ్య గొడవలు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఈఈ (executive engineer ) తీరు మారకపోతే ఈ నెల 21 నుంచి రీలే దీక్షలు చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు.