పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత - విలువ రూ.2 కోట్లపైనే - HUGE GOLD SEIZED AT PANTHANGI
Published : Aug 1, 2024, 7:45 PM IST
3.57 KG Gold Bars Seized : బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా, అక్రమార్కులు మాత్రం వివిధ మార్గాల్లో పసిడిని తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. తాజాగా కారు హ్యాండ్ బ్రేక్ వద్ద ప్రత్యేక భాగాన్ని ఏర్పాటు చేసి బంగారం తరలిస్తుండగా, పక్కా సమాచారం మేరకు దాడి చేసి డీఆర్‌ఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, చెన్నై నుంచి కర్ణాటకలోని బీదర్ తరలిస్తున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద స్విఫ్ట్ కారును తనిఖీ చేసిన అధికారులు, కారు హ్యాండ్ బ్రేక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో 3.57 కిలోల 24 క్యారెట్ల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.52 కోట్లు ఉంటుందని వెల్లడించారు. నిందితులు విదేశాల నుంచి చెన్నైకి వచ్చి బంగారాన్ని బీదర్లో అందించేందుకు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు.