అధికార పార్టీని వీడిన అక్కసుతో టైల్స్ షాపుపై తనిఖీలు: బీజేపీ నేత సీఎం రమేశ్ - Buchi Babu Tiles Shop - BUCHI BABU TILES SHOP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 10:55 AM IST
DRI Officials Inspected Buchi Babu Tiles Shop in Anakapalli District : వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారన్న అక్కసుతో టైల్స్ వ్యాపారిపై విప్ కరణం ధర్మశ్రీ వేధింపులకు దిగారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని డీఆర్‌ఐ అధికారులతో వ్యాపారికి చెందిన దుకాణంపై గురువారం దాడులు చేయించారు. తనిఖీలకు వచ్చిన అధికారులు రూ.25 లక్షలు సీజ్ చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో శిలపరశెట్టి బుచ్చిబాబు టైల్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆయన ఇటీవల ధర్మశ్రీని వ్యతిరేకించి తెలుగుదేశంకి మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో గురువారం విజయవాడ నుంచి వచ్చిన డీఆర్‌ఐ అధికారులు బుచ్చిబాబు దుకాణ సముదాయంలో తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరాలను తొలగించి తనిఖీ చేశారు. బుచ్చిబాబు, అతడి సోదరుడు శ్రీనివాస్, గుమాస్తాల సెల్‌ఫోన్లను తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనానికీ వెళ్లనీయకుండా తనిఖీలు చేస్తుండటంతో సన్నిహితుల ద్వారా విషయాన్ని చోడవరం అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, అనకాపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సాయంత్రం ఇద్దరు నాయకులు దుకాణం వద్దకు చేరుకుని ఎందుకు తనిఖీలు చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఎవరో చెప్పిన మాటలు విని పనిచేస్తే ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు.