ఓడిపోతామని తెలిసినా వైఎస్సార్సీపీ నేతలు హడావుడి చేస్తున్నారు: నారాయణ - CPI Narayana On YSRCP - CPI NARAYANA ON YSRCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 4:22 PM IST
CPI Narayana On YSRCP: ఓట్ల లెక్కింపు కేంద్రాలలో నిబంధనలు పాటించేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దంటూ రెచ్చగొట్టేలా సజ్జల చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ ఓడిపోతుందన్న అంశాన్ని స్పష్టం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఓడిపోతామని తెలిసినా అధికారుల్ని, కేడర్ని నమ్మించడానికి వైఎస్సార్సీపీ నేతలు విశాఖలో హడావుడి చేస్తున్నారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్సీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. డీఐజీ ఇంటెలిజెన్స్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ రాజకీయ కక్షతో వెంకటేశ్వరరావును విధుల్లోకి రానీయకుండా చేశారన్నారు. చివరి నిమిషంలో అయినా తప్పు తెలుసుకుని ఏబీ వెంకటేశ్వరావుకి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా సంతోషమన్నారు.
సంగీతంలో ప్రాంతీయవాదం తగదు: తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడని, రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదన్నారు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్నీ రివర్స్ చేస్తే, రేవంత్ రెడ్డి ఆయన నెత్తిన ఆయనే చెత్త వేసుకున్నట్టు అవుతుందన్నారు. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడాన్ని అభినందిస్తున్నామని, చిహ్నం జోలికి పోకపోవడం మంచిదని ఆయన తెలిపారు. తెలంగాణ గేయానికి సంగీత దర్శకుడు కీరవాణిని పెట్టడంపై ప్రాంతీయవాదం ముందుకు తేవడం సబబు కాదన్నారు. సంగీతంలో కూడా ప్రాంతీయ వాదం తగదన్నారు.