జగన్, చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు: సీపీఐ నారాయణ - CPI Narayana allegations on Jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 5:54 PM IST
CPI Narayana Allegations on CM Jagan: దేశ చరిత్రలో బెయిల్పై సుదీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి జగన్ బానిస కాబట్టి వైసీపీ ప్రభుత్వం జోలికి పోలేదన్నారు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. 17ఏ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి చంద్రబాబు కూడా కేంద్రానికే దాసోహం అంటున్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని, రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. విభజన హామీలను ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
బీజేపీ ప్రభుత్వం రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందని నారాయణ మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించడంతో రైతులు ఆందోళన చేపట్టారన్నారు. దేవుళ్లను ఒక వైపు పూజిస్తూ మరో వైపు రైతులను చితకబాదుతున్నారని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాతన దేవాలయాలు, మసీదులను మోదీ తవ్విస్తున్నారని దీంతో పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అవేదన వ్యక్తం చేశారు.