కానిస్టేబుల్ గణేష్ కుటుంబంలో అంతులేని విషాదం- పెద్ద దిక్కు కోల్పోయి మిన్నంటిన రోదనలు - టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 5:50 PM IST
|Updated : Feb 6, 2024, 7:23 PM IST
Constable Dead in Sandalwood Smugglers Attack: కానిస్టేబుల్ గణేశ్ మరణవార్తతో సత్యసాయి జిల్లా ధర్మవరం సమీపంలో ఉన్న గుట్టకింద పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం చీనేపల్లి వద్ద ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ గణేశ్ మృతి చెందారు. కుమారుడి మరణవార్త విన్న ఆ తల్లి గుండె తల్లడిల్లింది. పేద కుటుంబంలో జన్మించిన గణేష్ పదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి శ్రీరాములు మృతి చెందాడు. అప్పట్నుంచీ తల్లి అలివేలమ్మ కూలి పనులు చేస్తూ గణేశ్‌ను డిగ్రీ వరకు చదివించింది.
గణేష్ పోలీసు ఉద్యోగం సాధించిన తర్వాత స్వగ్రామంలోనే అనూష అనే యువతని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రాజు, కృష్ణ వేదాన్స్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాపిల్లలతో కలిసి గణేష్ తిరుపతిలో నివాసం ఉంటున్నారు. కుమారుడు మృతి చెందిన విషయం తెలియడంతో తల్లి అలివేలమ్మ కన్నీటి పర్యంతమైంది. విధులకు వెళ్లి వస్తానని ఫోన్ చేసిన కుమారుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గణేష్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తమ్ముడి మృతి చెందడంతో గణేష్ ఫోటో చేత పట్టుకొని సోదరి గంగాదేవి విలపించడం పలువురిని కలచివేచింది. అలివేలమ్మకు గణేష్ ఒక్కడే కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. గణేష్ మరణ వార్తతో ఆ ప్రాంతం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గణేష్ మృతదేహం కోసం గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.