కాటసాని భూ కబ్జాలపై కమిటీ వేయాలి- బాధితులకు న్యాయం చేయాలి: గౌరు చరితా రెడ్డి - ఎమ్మెల్యేపై ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 5:35 PM IST
Panyam MLA Katasani Rambhupal Reddy: పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భూ కబ్జాలపై కమిటీని వేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత గౌరు చరితా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే అక్రమాలపై కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేశారు. కాటసాని కబ్జాలపై గతంలోనే బహిరంగ చర్చకు సవాల్ విసిరామని, ఎమ్మెల్యే కాటసాని అసెంబ్లీ ఉందని సాకుచెప్పి తప్పించుకున్నారని గౌరు చరితా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే భూ అక్రమాలపై అధికారులు స్పందించాలని కోరారు. ఎమ్మెల్యే పేదల భూములను లాక్కున్నారని ఆరోపించారు.
అక్రమాలకు పాల్పడ్డ ఎమ్మెల్యే తాను సత్యహరిశ్చంద్రుడిని అంటూ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పాణ్యంలో తాను ఎక్కడా తప్పు చేయలేదంటూ, ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల భూములు, ఎన్ఆర్ఐల భూములు, వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని స్పందనలో కోరారు. కాటసాని కబ్జాల బాధితులు ఇతర దేశాల నుంచి ఫోన్ చేస్తున్నారని చరితా రెడ్డి పేర్కొన్నారు.