తిరుమల నడకమార్గంలో చిరుత కలకలం - అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు - Cheetah movements in tirumala
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 1:45 PM IST
Cheetah at Alipiri Walkway in Tirumala : తిరుమల అలిపిరి కాలిబాటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నెల 25, 26 తేదీల్లో అలిపిరి నడకమార్గంలో చిరుత కదలికలపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల నుంచి చిరుత సంచారంపై నిఘా పెట్టిన అటవీ శాఖ అధికారులు తాజాగా చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అలిపిరి కాలిబాట అడవి ప్రాంతంలో ఓ పంది వెళ్తుండగా చెట్టుపై నుంచి దాన్ని వేటాడేందుకు చిరుత తదేకంగా చూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో పాటు ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులను అలర్ట్ చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.