మాజీ మంత్రి ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదు - case Filed on Alla Nani - CASE FILED ON ALLA NANI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2024, 6:36 PM IST
Cheating Case Filed on Former Minister Alla Nani: మాజీ మంత్రి ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది. ఆళ్ల నానితో పాటు మరికొందరిపై ఏలూరు త్రీ టౌన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్సార్సీపీ నాయకురాలు నాగమణి అనే మహిళ గాయపడ్డారు. ఎన్నికల సమయంలో నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు. ఓ అపార్టుమెంట్లోని 4వ అంతస్తులో ప్రచారం ముగించుకొని కిందకు దిగేందుకు అందరూ లిఫ్ట్ ఎక్కారు. అది ఫెయిలై కిందకు పడిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ క్రమంలో నాగమణికి గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కూడా ఆ సమయంలో ఉన్నందున ఎన్నికల సంఘంతో ఇబ్బందులు వస్తాయని విషయాన్ని బయటకు రానీయలేదు.
అయితే వైద్య ఖర్చులు భరిస్తామని అప్పట్లో ఆళ్ల నాని హామీ ఇచ్చినట్లు బాధితురాలు నాగమణి ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆళ్ల నాని చెప్పారని, అనంతరం పట్టించుకోలేదని నాగమణి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఆళ్ల నాని సహా ఏడుగురిపై ఏలూరు 3 టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.