"శభాష్ రామానాయుడు"- వరద నియంత్రణ చర్యలపై చంద్రబాబు ప్రత్యేక అభినందనలు - CBN CONGRATULATED NIMMALA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2024, 9:46 AM IST
Chandrababu on Minister Nimmala : ఎగువన కురుస్తున్న వర్షాలకు పులివాగు పొంగి ప్రవహిస్తుంది. ఈ కారణంగా బుడమేరుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. నీటి ఉద్ధృతికి అనుగుణంగా బుడమేరు గండ్ల గట్టు ఎత్తు పెంపు చేపట్టారు. పెరుగుతున్న ప్రవాహానికి అనుగుణంగా పెంపు పనులను చేపడుతున్నారు. వీటిని శనివారం రాత్రి వర్షంలోనూ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు.
Budameru Works Updates : మంత్రి నిమ్మల రామానాయుడు చొరవను, కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు. "గుడ్ జాబ్ రామానాయుడు" అంటూ అభినందనలు తెలిపారు. ఇందులో పాల్గొన్న అందరిని ఆయన ప్రశసించారు. ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని నిమ్మలను సీఎం అడిగి తెలుసుకున్నారు. బుడమేరు గట్టు ఎత్తు పెంచి, బలోపేతం చేయాలని సూచించారు. మరింత వరద వచ్చే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని మంత్రికి చంద్రబాబు సూచనలు చేశారు. మరోవైపు గండ్లను పూడ్చేందుకు సైన్యం కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలు చేసి పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా ఆ గండ్లను పూడ్చివేశారు.