అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న ద్వారంపూడి - కేసు నమోదు - Case Filed on Dwarampudi - CASE FILED ON DWARAMPUDI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 10:18 AM IST
Case Filed on Dwarampudi Chandrasekhar Reddy : కాకినాడలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. రాజ్యలక్ష్మినగర్‌లో వైఎస్సార్సీపీ నాయకుడి అక్రమ నిర్మాణం కూల్చి వేత సమయంలో మున్సిపల్ అధికారుల విధులకు విఘాతం కలిగించారని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో సహా మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో గురువారం కేసు పెట్టారు.
ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైఎస్సార్సీపీ నాయకుడు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ద్వారంపూడి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర్ నాయక్ తెలిపారు.