యాదాద్రిలో బాలుడి కిడ్నాప్ - సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన పోలీసులు - Yadadri Boy Kidnap Case news
Published : Feb 10, 2024, 1:05 PM IST
Boy Kidnap Case in Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 5న బాలుడి కిడ్నాప్ కేసును భువనగిరి పట్టణ పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడితో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు ఈ నెల 4న కూలీ పని చేసుకోవడానికి తన కుటుంబసభ్యులతో భువనగిరికి వచ్చాడు. భువనగిరిలోని బస్టాండ్ సమీపంలో నిద్రిస్తుండగా 5న ఉదయం ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బాలుడు సిద్దరాములును కిడ్నాప్ చేశారు. బాలుడి కోసం 5వ తేదీన తండ్రి రాజు వెతకగా కనిపించకపోవడంతో మరుసటి రోజు ఉదయం భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Boy Kidnap CCTV Video Viral : దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. బాలుడిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని స్వాధీనం చేసుకొని తండ్రి రాజుకు అప్పగించారు. నిందితులు బానోతు మోహన్, ఫల్తిత విజయ, ఓరుగంటి సమంతగా గుర్తించినట్లు తెలిపారు. వారి నుంచి ఓ బైక్, ఓ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.