హైదరాబాద్ టీ హబ్‌లో బోనాల పండుగ - 101 మంది పోతురాజులతో ప్రత్యేక ప్రదర్శన - T Hub Bonalu Festival Celebrations
Published : Jul 14, 2024, 10:21 PM IST
Bonalu Festival Celebrations at T-Hub 2024 : హైదరాబాద్ టీ హబ్‌లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కంప్యూటర్లతో కుస్తీపడే ఐటీ ఉద్యోగులు బోన మెత్తి అమ్మవారికి సమర్పించి భక్తి పారవశ్యంతో పొంగిపోయారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే బోనాల పండగను ఐటీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ టీ హబ్‌లో టీటా ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర రికార్డు సృష్టించింది. 101 మంది పోతురాజులు నృత్యాలు, కొమ్ముకోయ, గుస్సాడి నృత్య ప్రదర్శనలు, డప్పు కళాకారులు, గిరిజన సాంప్రదాయ కళలను ప్రదర్శిస్తూ నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.
గత 11 సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగులంతా కలిసి బోనాల పండుగను నిర్వహించుకుంటున్నట్లు టీటా ప్రెసిడెంట్ సందీప్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఏటా ఆషాడంలో వచ్చే రెండో ఆదివారం ఈ బోనాలు నిర్వహిస్తుంటామని, అది నాటి నుంచి ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇది 12వ టీటా అతిపెద్ద బోనాలుగా చెప్పొచ్చని సందీప్ వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ బూ అబ్దుల్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.