బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత రచ్చబండ - AP BJP SC Morcha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 10:36 PM IST
BJP SC Morcha called for Dalit Racchabanda: బీజేపీ జాతీయ కార్యవర్గం బస్తీ సంపర్క్ కార్యక్రమం కోసం ఇచ్చిన పిలుపు మేరకు, ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎనిమిది వేల బస్తీలలో దళిత రచ్చబండ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాన్ని రచ్చబండ వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని నిశ్చయించారు.
దళిత రచ్చబండ ప్రచార పోస్టర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆవిష్కరించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ కోటి మంది దళితులకు వైఎస్సార్సీపీ అన్యాయం చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యాలయాల్లో మత మార్పిడిలను ప్రోత్సహిస్తోందని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 26 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని విమర్శించారు. దళితులకు చెందాల్సిన భూములు సైతం పారిశ్రామికంగా కేటాయించి దళితులను మోసం చేసిందని దుయ్యబట్టారు. మద్యతరగతి ప్రజలతోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ కార్యవర్గ సమావేశ అనంతరం బీజేపీ ఎన్నికల ప్రణాళికా సభ్యులకు పురందేశ్వరి దిశానిర్దేశం చేశారు.