పేదల పొట్ట కొట్టడం తప్ప - వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు: సాధినేని యామిని - YSRCP Government irregularities - YSRCP GOVERNMENT IRREGULARITIES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 1:44 PM IST
BJP Leader Sadineni Yamini Fire on YSRCP Government : పేదల పొట్ట కొట్టడం తప్ప వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ నేత సాధినేని యామిని విమర్శించారు. సొంత ఇంట్లోని మహిళలకు సమాధానం చెప్పలేని వైఎస్సార్సీపీ పెద్దలు రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేయగలరని ప్రశ్నించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు అధికారులు ప్రతిపక్షాలు, మీడియాపై ఫిర్యాదు చేయడం దారుణమని యామిని ఆక్షేపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చేసిందని యామిని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. కొంత మంది పోలీస్లు, కొంత మంది అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేకుండా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని యామిని అన్నారు. కేంద్రం పంపిస్తున్న నిధులని పక్క దోవ పట్టిస్తున్నారని, సహజ వనరులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తుంటే దాడులకి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిజమైన సంక్షేమ పాలన అందించాలంటే ప్రజలు ఎన్డీఏ కూటమి గెలిపించాలని కోరారు. పూర్తి స్థాయిలో కేంద్రం పంపించే నిధులను ప్రజలకి అందించాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.