శ్రీశైల మల్లన్న సేవలో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు- అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే మకాం! - శ్రీశైలంలో బీహార్ ఎమ్మెల్యేలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 1:42 PM IST
Bihar Congress MLAs visited Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని బీహార్ రాష్ట్రానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఆలయ దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేలకు కృష్ణదేవరాయ గోపురం వద్ద అధికారులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. బీహార్ ఎమ్మెల్యేలకు తెలంగాణలోని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు బయలుదేరారు.
తెలుగు రాష్ట్రాల్లో బీహార్ ఎమ్మెల్యేలకు ఏం పనో : బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. బీహార్‌లో ఇటీవల జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శాసనసభలో ఈ నెల 12న బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు ఆ పార్టీ అధిష్ఠానం జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం తెలంగాణాలోని హైదరాబాద్‌కు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించారు. మరోవైపు ఎమ్మెల్యేలను ఒకే రిసార్ట్స్‌లో ఉంచకుండా ప్రతి 2 రోజులకు ఒకసారి వారిని రిసార్ట్స్ మార్చాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వారందరూ ఈ నెల 12 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉంటారని సమాచారం. అందులో భాగంగానే నేడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.