'స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు మారణాయుధాలతో ఉంటే పోలీసులు ఏం చేశారు?' - Beeda Ravichandra on Palnadu Riots - BEEDA RAVICHANDRA ON PALNADU RIOTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 12:53 PM IST
Beeda Ravichandra About Palnadu Riots : ఎన్నికల సమయంలోనూ కొందరు పోలీసు అధికారులు వైఎస్సార్సీపీ నేతలకు అనుకూలంగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ నేత బీదా రవిచంద్ర మండిపడ్డారు. తిరుపతి మహిళా వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు మారణాయుధాలతో ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నెల్లూరు, పల్నాడు, తిరుపతి అనేక జిల్లాల్లో పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ గూండాలు చెలరేగిపోయరని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు ఓటమి భయంతోనే ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు చేసిన అరాచకాలు చాలవన్నట్లు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇలా రెచ్చిపోతుంటే కొందరు పోలీసులు వారికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఘర్షణలు జరగడాన్ని గమనిస్తే వైఎస్సార్సీపీ అరాచకీయం కనిపిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అల్లరి మూకలు తెలుగుదేశం నేతలపై, కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే పోలీసులు భద్రతా చర్యలు, ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ప్రజల్లో భయాందోళన నెలకొంది.