వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించాలి : బండి సంజయ్
Published : Mar 20, 2024, 7:01 PM IST
Bandi Sanjay Visit Damaged Crops : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున తక్షణ సాయం అందించాలని ఆయన కోరారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల బీమా పథకం, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 లక్షల సాయం అందించాలని కోరారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన బండి సంజయ్ బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, పొతుగల్, గంభీరావుపేట ప్రాంతాల రైతులు చాలా నష్టపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏ రైతు కూడా లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కేవలం చేసిన అప్పులు తీర్చడం కోసమే వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. తాము ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.