ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన బాలకృష్ణ సతీమణి వసుంధర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 11:30 AM IST
Balakrishna Wife Vasundara Devi Open Water Plants: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని మెురంపల్లి, కోడూరు ప్రాంతాలలో రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాలను ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ధనలక్ష్మీ రోడ్డులో మురుగు కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే సొంత నిధులతో పాటు పలువురి సహకారంతో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాహార్తిని దృష్టిలో పెట్టుకుని గొల్లపల్లి నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌తో హిందూపురం పట్టణానికి నీటిని తీసుకొచ్చారని అన్నారు. నియోజకవర్గంలో బాలకృష్ణ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దడంతో 2014, 2019 ఎన్నికల్లో ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించారని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణను అత్యధిక మెజారీటీతో గెలిపించాలని వసుంధర దేవి ప్రజలను కోరారు.
మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక పరికరాలతో ఈ వాహన వైద్య సేవలు పేద ప్రజల కోసం ఏర్పాటు చేశారు. వ్యాధి నిర్థరణ పరీక్షలు చేయించుకోవడానికి ఖర్చులు భరించలేని పేదవారి కోసం మొబైల్ వాహనం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.