తెలుగు యువత ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన- మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ - Unemployed youth strike
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 10:47 PM IST
AP Unemployed Youth Protest for Mega DSC Notification : కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుయువత ఆధ్వర్యంలో డీఎస్సీ (DSC) అభ్యర్థులు రోడ్డెక్కారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. నిరుద్యోగులకు టీడీపీ, జనసేనలు అండగా నిలబడతాయని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. B.ED, డైట్ విద్యార్థులు చేపట్టిన ఒక్క రోజు రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తానని అబద్ధపు హామీలు ఇచ్చి నిరద్యోగులను జగన్ మోసం చేశాడని మండిపడ్డారు.
మెగా డీఎస్సీ అంటే ఏంటో తెలియని వారు మంత్రులుగా, ప్రభుత్వ సలహా దారులుగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండు సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో 18,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆనాడు జగన్ మోహన్ రెడ్డి విమర్శించాడని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పి జగన్ మాట తప్పాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవనిగడ్డకు వస్తే ఉద్యోగం వస్తుందని నమ్మి వేల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడకు వస్తారని వివరించారు. గత ఐదేళ్లుగా వేల మంది నిరుద్యోగులు అవనిగడ్డలో ఉంటూ, ఒక్కపూట తిని తినకుండా, ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతన్నరని తెలిపారు.