కేఏ పాల్ పిటిషన్ స్పందించిన హైకోర్టు - తగు నిర్ణయం తీసుకోవాలని సీఈవోకు ఆదేశం - KA Paul on Elections Schedule
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 9:37 AM IST
AP High Court Hearing KA Paul Petition : ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పాల్ సమర్పించిన వినతిపై నిర్ణయం తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర సీఈవోను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ కేఏ పాల్ నేరుగా వాదనలు వినిపించారు.
KA Paul Petition about Andhra Pradesh Elections Schedule : ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, ఏపీలో ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య 21 రోజుల గడువు ఉందని అన్నారు. ఈ మధ్యలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందన్నారు. గతంలో నాలుగువేల ఈవీఎంలు రీప్లేస్ చేశారనే ఆరోపణలు వచ్చాయని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని పిటిషనర్ పోరాడుతున్నారని తెలిపింది. కేఏ పాల్ ఇచ్చిన వినతిపై తగు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని(సీఈవో) ఆదేశించింది.