అంగన్వాడీ సహాయకురాలు ఆత్మహత్యాయత్నం - ప్రభుత్వ బెదిరింపులే కారణం! - andhra pradesh
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 1:34 PM IST
Anganwadi Worker Suicide Attempt: అనంతపురం నగరంలో అంగన్వాడీ సహాయకురాలు సరిత ఆత్మహత్యాయత్నం చేశారు. హెయిర్ కలర్ సూపర్ వాస్మోల్ తాగి బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది. గత 41 రోజులుగా అంగన్వాడీలు రోడ్డుపై సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని సరిత ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోగా ఎస్మా చట్టాన్ని తమపై ప్రయోగించి, విధుల నుంచి తొలగిస్తామని బెదిరించారు. దీంతో ప్రభుత్వ బెదిరింపుల కంటే ఆత్మహత్యే శరణమని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని సరిత వాపోయారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కన్నీరు పెట్టుకున్నారు. సరిత అనంతపురం నగరంలోని రాణి నగర్లో ఉన్న అంగన్వాడి సెంటర్లో సహాయకురాలుగా పని చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు ప్రభుత్వం జీతాలు పెంచమంటే విధుల నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, జీతాలు సరిపోవట్లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మాకు రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని సరిత కోరారు. ప్రస్తుతం సరిత అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.