ప్రభుత్వం హెచ్చరికలు - గుండెపోటుతో అంగన్వాడీ మృతి - అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 8:31 AM IST
Anganwadi Worker Died : కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త చంద్రమళ్ల శేషారత్నం గుండెపోటుతో మృతి చెందింది. 42 రోజుల పాటు జరిగిన సమ్మెలో భాగంగా రోజూ నిరసన కార్యక్రమాల్లో శేషారత్నం పాల్గొంది. సమ్మెలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమానికి బయల్దేరినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో చంద్రమళ్ల శేషారత్నం చలో విజయవాడలో పాల్గొనేందుకు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు.
ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పడంతో ఆందోళనతో రాత్రి సమయంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శేషారత్నం కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ 42 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వం వారి మెడపై "తొలగింపు" కత్తిపెట్టి బలవంతంగా రాత్రి సమయంలో సమ్మెను విరమింపజేసింది. ఒక్క రూపాయీ జీతం పెంచకుండానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంతాన్ని నెగ్గించుకుందని పలువురు విమర్శిస్తున్నారు.