రైతుల అంగీకారం - సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు తొలగిన అడ్డంకులు - amaravati seed access road
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 9:51 AM IST
Amaravati Seed Access Road: అమరావతి రాజధానిలోకి వెళ్లేందుకు ఉద్దేశించిన సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగాయి. సమీకరణ విధానంలో ప్రభుత్వం భూములు తీసుకోనుంది. దీనికి రైతులు అంగీకరించారు. గతంలో టీడీపీ హయాంలో విశాలమైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చురుగ్గా సాగిన పనులు 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి. కరకట్ట దిగువన మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు వచ్చి ఆగిపోయింది.
భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించకుండా కోర్టుకు వెళ్లారు. గత నెలలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, కీలకమైన ఈ రోడ్డుపై దృష్టి సారించారు. మిగిలిన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ప్రారంభించేందుకు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇటీవల సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, పెనుమాక, ఉండవల్లిలోని రైతులతో చర్చలు జరిపారు. ఇవి కొలిక్కి రావడంతో మంతెన ఆశ్రమం నుంచి నేషనల్ హైవేపై ఉన్న మణిపాల్ ఆసుపత్రి వరకు రెండు దశల్లో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.