LIVE: విజయవాడలో అఖండ కచ్ఛపీ మహోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - akhanda kachchapi mahotsavam
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 9:27 AM IST
LIVE : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వేదికగా శ్రీ సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో అఖండ కచ్ఛపీ మహోత్సవం వీణుల విందుగా సాగుతోంది. వీణానాదం తన్మయులను చేస్తోంది. పదుల సంఖ్యలో కళాకారులు తమ వేళ్లతో రాగాల చివురులను తొడుగుతున్నారు. సాక్ష్యాత్తూ సరస్వతి కొలువై సుమధుర స్వరాలను పలికించి సంతోషిస్తోందా.. అనే అనుభూతిని కళాకారులు పొందుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల కళాకారులు కూడా ఈ కచ్ఛపీ మహోత్సవానికి హాజరయ్యారు. ముందుగా త్యాగరాజ పంచరత్న కీర్తనలతో వీణా వాద్య సమ్మేళనాన్ని కళాకారులు ప్రారంభించారు. పౌరాణికంగాను సాహిత్యపరంగానూ వీణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నానాటికీ వీణ కళాకారుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ఉత్సవాల ద్వారా కళాకారుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా కొత్త కళాకారులను తీర్చిదిద్దేందుకు తమ సంస్థ అఖండ కచ్చపీ మహోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 15న నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని వీణ కళాకారులు అందరినీ ఒకేచోటకు తీసుకొచ్చే ఉత్సవాన్ని నిర్వహించడం గొప్ప సాహసమేనని వీణకళాకారులు తెలిపారు.
అఖండ కచ్ఛపీ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం మీ కోసం