Break to Shirdi Sai Electricals Payments: షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా రూ.270 కోట్ల చెల్లింపులకు బ్రేక్ పడింది. దీనిపై నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతే ముందుకు వెళ్లాలని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) సీఎండీ సంతోషరావును ప్రభుత్వం ఆదేశించింది. సీఎండీ సంతోషరావును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలిపించి, నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులు చెల్లింపుపై మీడియా కథనాలపై వివరణ కోరారు.
వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేసిన తర్వాతే అనుబంధ పరికరాలకు మిగిలిన 20 శాతాన్ని చెల్లించాలన్న నిబంధన ఉండగా, అనవసర వ్యవహారాలకు అవకాశం కల్పిస్తున్నారని సీఎండీ సంతోషరావుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టెండరు నిబంధన ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాకే బిల్లులు చెల్లించాలని మంత్రి ఆదేశించారు. అందుకు విరుద్ధంగా చెల్లింపు ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఏంటని సీఎండీని నిలదీశారు. వరుసగా మీడియాలో వస్తున్న కథనాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్న విషయాన్ని సీఎండీకి అర్ధమయ్యేలా నొక్కి చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కాకుండా, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
డిస్కంలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా గత ప్రభుత్వానికి సన్నిహిత సంస్థ అయిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించడమేంటని నిలదీసినట్లు సమాచారం. ఇకమీదట ఇలాంటి వ్యవహారాలు జరగడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దృష్టికి రాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పటంతో పాటు ఏదైనా పనులను ప్రతిపాదించే ముందే వాటి అవసరం ఎంత ఉందని తెలుసుకున్నాకే ముందుకెళ్లాలని మంత్రి స్పష్టం చేశారు.
అదే విధంగా గ్రామాల్లో విద్యుత్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వేసవిలో విద్యుత్ కోతలు ఉండకూడదని సీఎండీకి మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ ఇచ్చిన హామీ మేరకు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు భారీ షాక్ - వ్యసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు!