రోడ్డు దాటాలంటే సాహసం చేయాల్సిందే - జేసీబీ లోడర్‌లో ఎక్కి వాగు దాటిన టీచర్లు - Teachers Adventure - TEACHERS ADVENTURE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2024, 5:53 PM IST
Teachers Adventure to Goto School in Agency Areas of Alluri District: రాష్ట్రంలో వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. భారీ వర్షాలకు రహదారి మునగడం వల్ల పాఠశాలకు వెళ్లేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పెదమాకవరం ఉపాధ్యాయులు నానా తిప్పలు పడుతున్నారు. కొయ్యూరు మండలం పెదమాకవరం సమీపంలో వాగు ఉప్పొంగింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గం గుండా శరభన్నపాలెం, నడింపాలెం పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉపాధ్యాయులు సాహసం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న జేసీబీ నిర్వాహకులు వారికి సాయం చేశారు. జేసీబీ వాహనం లోడర్‌లో వారిని కూర్చోబెట్టి వాగు దాటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాలంటే ఇలాంటి సాహసాలు నిత్యకృత్యమయ్యాయని, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంగా ఉందని ఉపాధ్యాయులు వాపోయారు.