World Backup Day 2024 :ప్రస్తుత రోజుల్లో డేటా అనేది చాలా ముఖ్యం. సంపద సృష్టికి ప్రధాన ఇంధనంగా డేటా మారిపోయింది. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఈ డేటా చాలా అవసరం. అందుకే సైబర్ దాడుల ముప్పు నుంచి డేటాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గణాంకాల ప్రకారం, 2023లో డేటా లీకేజ్, డేటా కాంప్రమైజింగ్ వల్ల ఒక్క యూఎస్‌లోనే దాదాపు 353 మిలియన్ల మంది వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు గురయ్యారు. మార్చి 31వ తేదీన 'వరల్డ్ బ్యాకప్ డే' సందర్భంగా డేటా బ్యాకప్, డేట్ బ్రీచింగ్, క్లౌడ్ బేస్డ్ బ్యాకప్గురించి పలు వివరాలు తెలుసుకుందాం.
డేటా అమ్ముకుంటున్నాయ్!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఆస్పత్రులు డేటా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. దీనితో యూజర్లు, పేషెంట్లు భారీగా ఆర్థికంగా నష్టపోయారు. దీనితో నియంత్రణ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై భారీ జరిమానాలు విధించాయి. చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి. బాధితులకు పరిహారం అందించేలా చేశాయి. కానీ బడా కంపెనీలు ఇలా డేటా ఉల్లంఘనలకు పాల్పడుతుండడం తీవ్రమైన దిగ్భ్రాంతి కలిగించే విషయం.
డేటా బ్రీచింగ్
వ్యక్తిగత లేదా బడా వ్యాపార సంస్థల డేటా బ్రీచ్ అయితే అది తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు దెబ్బతింటాయి. స్టాక్ మార్కెట్లో సదరు కంపెనీల విలువలు భారీగా తగ్గిపోతాయి. చివరకు ఇది పెట్టుబడిదారులకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతుంది. పైగా మార్కెట్లు సంస్థల పలుకుబడి దెబ్బతింటుంది. పెద్దపెద్ద సంస్థలైతే వీటిని తట్టుకోగలుగుతాయి. కానీ సాధారణ, చిన్న వ్యాపారులు పూర్తిగా దెబ్బతింటారు. చివరకు తమ బిజినెస్‌ను పూర్తిగా మూసుకోవాల్సి వస్తుంది. పలు గణాంకాల ప్రకారం, అమెరికాలో డేటా బ్రీచింగ్ వల్ల ఒక్క ఏడాదిలోనే దాదాపు 70 శాతం మంది చిన్నవ్యాపారులు తీవ్రమైన నష్టాలకు గురై పుర్తిగా వ్యాపారాన్ని మూసివేశారు.
ఆరోగ్య రంగం మరింత దారుణం
వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన డేటా చాలా సున్నితమైనది. ఇక్కడ కనుక డేటా కాంప్రమైజ్ అయితే ప్రభుత్వ సేవలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల సదరు ఆస్పత్రులపై, ప్రభుత్వ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.
వ్యక్తిగత డేటా భద్రత
వ్యాపార సంస్థల విషయంలోనే కాదు, వ్యక్తిగత డేటా కూడా చాలా విలువైనది. సైబర్ నేరగాళ్లు సాధారణ పౌరులను టార్గెట్ చేసుకుని వాళ్ల డేటాను కాజేస్తున్నారు. వారిని ఆర్థికంగా, మానసికంగా దోచుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో విలువైన డేటాను పౌరులు పోగొట్టుకుని, తరువాత దానిని తిరిగి రికవరీ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే, డేటా బ్యాకప్ ఫెసిలిటీ తప్పనిసరి. అందుకే వీటన్నింటినీ ప్రజలకు, సంస్థలకు గుర్తు చేయడానికి ప్రత్యేకంగా మార్చి 31న 'వరల్డ్ బ్యాకప్ డే'ను నిర్వహిస్తున్నారు.