Smartphone Market in India:దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ సంస్థ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన హవా కొనసాగిస్తోంది. స్మార్ట్‌ఫోన్ సేల్స్‌లో వాల్యూ పరంగా టాప్‌లో నిలిచింది. 22.8 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఐఫోన్లు తయారీ సంస్థ యాపిల్ రెండో స్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ నివేదిక తెలిపింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మూడో త్రైమాసికానికి సంబంధించిన గణాంకాల వివరాలను వెల్లడించింది.
వాల్యూ పరంగా టాప్ వన్‌లో శాంసంగ్:శాంసంగ్ తన ప్రీమియం ఫోన్లయిన ఎస్ సిరీస్ సేల్స్‌లో దూసుకుపోయి విలువ పరంగా మార్కెట్‌లో అగ్రస్థానం సాధించిందని ఈ రీసెర్చ్ అనలిస్ట్ ప్రచీర్ సింగ్ పేర్కొన్నారు. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లు, అందుబాటు ధరలో లభించే ప్రీమియం ఫోన్లలో గెలాక్సీ ఏఐ ఫీచర్లు అందించడం కూడా ప్రీమియం సెగ్మెంట్‌కు వినియోగదారులు మారడానికి ఉపయోగపడిందని సింగ్ అన్నారు. శాంసంగ్ మార్కెట్ వాటా గతేడాది వాల్యూ పరంగా 21.8 శాతంగా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 22.8 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో యాపిల్ వాటా 21.8 నుంచి 21.6 శాతానికి పడిపోయింది.