Jio New Cloud PC App:జియో ఫైబర్ ద్వారా ఇంటర్నెట్‌తో పాటు డిజిటల్ ఛానెల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో సంచలనానికే మారుపేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కొంతకాలం కిందట దీన్ని తీసుకుని వచ్చారు. టెలికాం రంగంలోకి అడుగుపెడుతూనే ఇది విప్లవం తీసుకొచ్చింది. అన్లిమిటెడ్ డేటాను తక్కువ ధరకే పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా మరెన్నో ఆశ్చర్యకర ప్రకటనలు చేసింది. తాజాగా ఈ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మరో కొత్త సంచలనానికి సిద్ధమైంది.
ఒక్క యాప్‌తో స్మార్ట్ టీవీ కంప్యూటర్‌లా:మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే నేపథ్యంలో రిలయన్స్ జియో ఓ కొత్త యాప్‌ను రూపొందించింది. ఒక్క యాప్ సాయంతో స్మార్ట్ టీవీని కంప్యూటర్‌లా మార్చుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ టెక్నాలజీని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్- 2024 ఈవెంట్‌లో ప్రదర్శించింది.
జియో క్లౌడ్ పీసీగా పిలిచే ఈ టెక్నాలజీతో కొన్ని వందల రూపాయలతోనే మీ స్మార్ట్ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇంటర్నెట్ సౌకర్యం, మౌస్, కీబోర్డు, స్మార్ట్‌టీవీ ఉంటే చాలు.. ఈ కొత్త జియో క్లౌడ్ పీసీ యాప్‌ను ఉపయోగించి టీవీని కంప్యూటర్‌లా మార్చుకోవచ్చని జియో పేర్కొంది. యాప్‌లో లాగిన్ అయ్యి కంప్యూటర్ తరహాలోనే ఈ-మెయిల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది.