Ola Launches Gen 3 Electric Scooters:ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్ శుక్రవారం తన కొత్త 'జెన్ 3 ఎలక్ట్రిక్' శ్రేణిని విడుదల చేసింది. ప్రీవియస్ జనరేషన్ మోడల్స్‌తో పోలిస్తే మెరుగైన డిజైన్, ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. అంతేకాక వీటి ధరలను కూడా ప్రీవియస్ వెర్షన్ కంటే తక్కువతోనే పరిచయం చేసింది.
నాలుగు వేరియంట్స్‌లో తీసుకొచ్చిన వీటిలో కంపెనీ అదిరే బ్యాటరీ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. 2kWh బ్యాటరీతో దీని ఎంట్రీ లెవెల్ 'S1 X' ధర మార్కెట్లో రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక 5.3kWh బ్యాటరీతో దీని అగ్రశ్రేణి 'S1 Pro+' ధర రూ.1,69,999 వరకు ఉంటుంది. ఈ లైనప్‌లోని వేరియంట్లు ఓలా లేటెస్ట్ EV ఆపరేటింగ్ సిస్టమ్ MoveOS 5పై నడుస్తాయి.
వేరియంట్స్:
- S1 Pro
- S1 Pro+
- S1 X
- S1 X+
వీటి రిలీజ్‌పై మాట్లాడిన ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ కంపెనీ తన పోటీదారుల కంటే ముందుందని అన్నారు. "మా పోటీదారులు మా Gen1 స్థాయిలో కూడా లేరు. కానీ మేము మాత్రం ఇప్పుడు Gen3 స్థాయిలో ఉన్నాము" అని ఆయన పేర్కొన్నారు.
ఈ Gen 3 స్కూటర్లు మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (MCU)లను కలిగి ఉంటాయి. ఇవి ప్రీవియస్ మోడల్స్‌లో ఉపయోగించిన హబ్ మోటార్లను రీప్లేస్ చేస్తూ వస్తాయి. పాత వాటి కంటే వీటిని ఐదు రెట్లు ఎక్కువ ఎఫిషియంట్, రిలియబుల్, లైట్‌వెయిట్‌తో డిజైన్ చేసినట్లు CEO భవిష్ అగర్వాల్ చెబుతున్నారు. అంతేకాక ఈస్కూటర్లు ప్రీ-లూబ్రికేటెడ్ O-రింగ్‌లను కలిగి ఉన్న చైన్ డ్రైవ్‌తో కూడా వస్తాయి. ఇవి ప్రీవియస్ మోడళ్లలో ఉపయోగించిన బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటాయని తెలుస్తోంది.
'బ్రేక్ బై వైర్' టెక్నాలజీ ఈ జెన్ 3 లైనప్‌కి అందించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్ వేర్, మోటార్ రెసిస్టెన్స్‌ను బ్యాలెన్స్ చేసేందుకు బ్రేక్ లివర్‌పై సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. తద్వారా దీని రేంజ్‌ను 15% పెంచుతుంది. ఇది బ్రేక్ ప్యాడ్ లైఫ్‌స్పాన్‌ను రెట్టింపు చేస్తుంది. బ్రేకింగ్ సమయంలో ఈ మోటార్ ఎలక్ట్రిసిటీని రీజనరేట్ చేసి ఎఫిషియన్సీని మరింత మెరుగుపరుస్తుంది. ఈ అద్భుతమైన టెక్నాలజీకి అగర్వాల్ పేటెంట్ కలిగి ఉన్నట్లు సమాచారం.
ఇప్పుడు తీసుకొచ్చిన ప్రతి Gen 3 స్కూటర్ మెరుగైన భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో వస్తుంది. అంతేకాక ఈ మోడళ్లలో తయారీ ఖర్చులలో 31% తగ్గింపు, ఎనర్జీ ఎఫిషియన్సీలో 10% పెరుగుదలతో పాటు ప్రీవియస్ జనరేషన్లతో పోలిస్తే వీటి పీక్ పవర్ 53% ఎక్కువగా ఉంటుంది.
బ్యాటరీ ఆప్షన్స్:ఈ Gen 3 శ్రేణి వివిధ బ్యాటరీ ఆప్షన్లను అందిస్తుంది.
దీని 'S1 Pro' మోడల్ 3kWh, 4kWh బ్యాటరీలను కలిగి ఉంది. అదే సమయంలో 'S1 Pro+' వేరియంట్ 4kWh లేదా 5.3kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. ఇందులో ఓలా ఇన్-హౌస్ భారత్ సెల్ ఉంటుంది.